గ‘లీజు’దందా!
కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రతినెలా అద్దెల రూపంలో రూ.లక్షల అక్రమ ఆదాయం రూ.100 కోట్ల విలువైనప్రభుత్వ భూమి పరాధీనం పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం
తాండూరు: తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూ ముల ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికారుల చేతివాటం.. ప్రజా ప్రతినిధుల అండదండలతో వందల ఎకరాల సర్కారీ భూ ములు పరాధీనంలోకి వెళ్తున్నాయి. లీజు పేరిట కొందరు స్థలాలను సొంతం చేరుకుంటే.. మరి కొందరు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కాందిశీకులకు చెందిన 484 చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ మార్గంలోని సర్వే నంబర్ 129లో 1.36 ఎకరాలు.. గొల్ల చెరువు సమీపంలోని సర్వే నంబర్ 111లో గల (ఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలం) భూమి పరాధీనం పాలయ్యింది. ఓ వ్యాపారి కుటుంబం పట్టణ నడి బొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దుకాణ సముదాయాలు నిర్మించి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా అద్దెల రూపంలో దండుకొంటున్నాడు.
అక్రమ రిజిస్ట్రేషన్
తాండూరు పట్టణ నడి బొడ్డున సర్వే నంబర్ 135లో 40.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇట్టి స్థలాన్ని రెవెన్యూ అధికారులు 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడ చాలా కాలంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా ఆస్పత్రి, పాత మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ పార్కు, టెలిఫోన్ భవన్, న్యాయస్థానం, ఓల్డ్ క్లబ్, డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇందులోని కొంత భూమిని దశాబ్దాల క్రితం సినిమా ఽథియేటర్ నిర్వహణ కోసం లీజుకు ఇచ్చారు. మూడేళ్ల క్రితం గడువు ముగిసింది. ఇంతవరకు బాగానే ఉన్నా మిగిలిన భూమిని కొంత మంది అక్రమార్కులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
వ్యాపారం కోసం విచ్చి..
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం చాలా ఏళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చింది. పట్టణంలో వ్యాపారం ప్రారంభించింది. ఆయిల్, దాల్ మిల్లుల పేరిట దశాబ్దాల క్రితం సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుంది. కొన్నేళ్ల క్రితం లీజు గడువు ముగిసింది. అంతకుముందే ఆయిల్ మిల్ మూత పడింది. లీజుకు తీసుకున్న స్థలానికి ఇరువైపులా జాతీయ రహదా రి ఉండటంతో సదరు వ్యాపారి కుటుంబంలోని నలుగురు సోదరులు ప్రభుత్వ భూమిని పంచుకున్నారు.ఆయిల్ మిల్ ప్రాంగణంలో విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకున్నారు. అంతటితో ఆగకుండా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను ఏర్పాటు చేసి లక్షల రూపాయలను అద్దెల రూపంలో వ సూలు చేస్తున్నారు. అంతేకాకుండా హోల్ సేల్ ఏ జెన్సీలు నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బషీరాబాద్, తాండూరు మండలాల్లో..
మండల కేంద్రమైన బషీరాబాద్‌లోని సర్వే నంబర్ 60లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని, తాండూరు పట్టణంలోని కాందిశీకుల స్థలాన్ని ఇదే కుటుంబానికి చెందిన ఓ వ్యాపారి కబ్జా చేశాడు. ఈ విషయమై గతంలో పలుమార్లు స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాలు చేశారు. కాందిశీకుల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులను వివరణ కోరిగా తమకు ఆ భూములతో ఎలాంటి సంబంధం లేదని సమాధానం చెప్పారు.
ఆయిల్ మిల్ పేరిట లీజు


