పరువు పైసలు
మానసిక వేదనలో ఓటమి అభ్యర్థులు రూ.లక్షలు ఖర్చు పెట్టినాప్రజలు ఆదరించలేదని ఆవేదన ఎందుకు విశ్వసించలేదని విచారం
పాయె!
కొడంగల్: మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ ఓట మిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది. ఫలితాలు తనకు అనుకూలంగా రాలేదని మానసిక క్షోభకు గురైంది. గ్రామంలో తన పరువు పోయిందని భావించింది. దీంతో మొ దటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితం వచ్చిన వెంటనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించడంతో గండం గడిచింది. ఇలాంటి ఘటనలు మరి కొన్ని జరిగినా వెలుగులోకి రాలేదు. పరువు పోతుందని బయటకు చెప్పడం లేదు.
అతి నమ్మకమే నట్టేట ముంచింది
పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే అతి విశ్వాసం.. అతి నమ్మకంతో మూడు విడతల్లోనూ పోటికి దిగిన పలువురు అభ్యర్థులు ఓటమితో కుంగిపోతున్నారు. ప్రజల్లో తమకున్న గుర్తింపు వల్ల గెలుస్తామని భావించారు. పార్టీల మద్దతు గ్రామ పెద్దల అండదండలతో ఓట్లు వస్తాయని అనుకున్నారు. విజయం నల్లేరుపై నడకే అని గుడ్డిగా నమ్మారు. ఓట్లు వేసే ప్రజల నాడీ తెలుసుకోలేక పోయారు. దీంతో ప్రజలు ఓటు వేయకపోవడంతో ఓటమి పాలయ్యారు. ఆయా పార్టీల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పనులను చూసి ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారని అనుకున్నారు. తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోటికి దిగినా వారిని ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టినా ఓటమి తప్పలేదు. దీంతో పరువు పాయే పైసలు పాయే దేవుడో అంటూ విలపిస్తున్నారు.
అప్పులు చేసి మరీ..
పలువురు సర్పంచ్ పదవిపై ఆశతో ఎన్నికల్లో ఎలాగైనా పోటి చేసి గెలవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ పోటీకి దిగారు. అయినా ప్రజలు కనికరించలేదు. దీంతో అటు పదవి రాక పోగా ఇటు అప్పులు మిగిలాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అయమయంలో ఉన్నారు.
ఎంపీటీసీ కోసం పైరవీలు
సర్పంచ్ పదువులకు పోటీ చేసి ఓడిన వారు త్వరలో వచ్చే ఎంపీటీసీ జెడీపీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారు. సానుభూతి ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి గ్రామాల్లో పోయిన పరువును దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో నేర్చుకున్న గుణపాఠం ఒక అనుభవంగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో విజయం ప్రయత్నాలు చేస్తున్నారు.


