హస్తంలో లుకలుకలు
వికారాబాద్‌లో తార స్థాయికి.. పంచాయతీ ఎన్నికల్లో ముదిరిన వైరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దే ఫ్లెక్సీల చించివేత స్పీకర్ సమక్షంలో పంచాయితీ అయినా సద్దుమనగని లొల్లి మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు
వికారాబాద్: కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్ని లొల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరింత రాజుకుంది. ఓ వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం నాయకులు చింపేయడంతో వివాదం బట్టబయలైంది. ఆరు నెలలుగా వికారాబాద్ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతో పార్టీ కేడర్ సతమతమవుతోంది. పట్టణ, మండల నాయకుల మధ్య నెలకొన్న వైరం స్పీకర్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వికారాబాద్ మండల అధ్యక్షుడి తల్లి సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించింది. ఆమెను ఓడించేందుకు పట్టణ అధ్యక్షుడు, అతని అనుచరగనం ఇతర పార్టీలతో చేతులు కలిపారని మండల నేతలు ఆరోపించారు. ఈ విషయం మీడియా ముందు బట్టబయలు చేయడంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పట్టణ అధ్యక్షుడి ఫ్లెక్సీని చించేశారు. ఓ వర్గం నాయకులను ఓడించేందుకు మరో వర్గం నేతలు పక్క పార్టీలతో చేతులు కలిపారు. వారిని ఫాంహౌస్‌కు పిలిపించుకుని విందులు ఇవ్వడం లాంటివి చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇలాంటి ఘటనలే పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోనూ చోటు చేసుకున్నాయి. తమ పార్టీ నేతలవల్లే తాము ఓటమిపాలయ్యామని హస్తం నేతలు ఆరోపించారు.
స్పీకర్ సమక్షంలో..
ఏడాది నుంచి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయారు. వారి మధ్య నెలకొన్న వివాదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు పట్టణ కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఉండగా.. తాజాగా పట్టణ, మండల నాయకుల మధ్య వివాదం తలెత్తింది. పరిస్థితిని అంచనా వేసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇరువర్గాల వారిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించినట్టు సమాచారం. పార్టీ ముఖ్యనేతల సమక్షంలో పంచాయితీ నిర్వహించి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమికి యత్నించిన వారిని మందలించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు పార్టీని వీడాలనే ఆలోచనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
నలుగుతున్న అధికారులు
అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు అధికారులకు సంకటంగా మారుతన్నాయి. ఈ పరిస్థితి వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గ్రూపు తగాదాలతో అటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు సతమతమవుతున్నారు. తమకు తెలియకుండా పట్టణంలో ఏ పని చేయకూడదని పార్టీ పట్టణ ముఖ్య నాయకుడొకరు కొంతకాలంగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ కాలనీల్లో పనులు చేయటానికి అతని పెత్తనం ఏంటని మరికొంత మంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ముఖ్య నేత జులూంతో విసిగిపోయిన పోలీసులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నేతలు ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంతకాలం ఓపిక పడుతూ వచ్చిన స్పీకర్ కూడా ఆ ముఖ్య నాయకుడిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై ఎవరూ ఆ నేత మాట వినాల్సిన పని లేదని స్పీకర్ అధికారులు, పోలీసులకు సూచించినట్టు సమాచారం.
వర్గపోరుతో కేడర్ సతమతం


