ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం ● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇందకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మండలంలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను శుక్రవారం నివాసంలో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితా లు వచ్చాయన్నారు. పరిగి మండలంలోని 30 జీపీల్లో ఎన్నికలు జరిగితే ఏకంగా 19మంది బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు గెలుపొందారని తెలిపారు. అధికార పార్టీకి కేవలం 10 సర్పంచ్ స్థానాలు మాత్రమే వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 50శాతం కన్న తక్కువ సీట్లు వచ్చాయన్నారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం వంటివి చేశారని ఆరోపించారు. అయినా అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎక్కడ చూసినా తమ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. గెలుపొందిన సర్పంచ్‌లకు అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్‌రెడ్డి, వెంకటయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


