బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను కాంగ్రెస్‌లోకి తీసుకోం
తాండూరు రూరల్: బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్‌ఎస్ సర్పంచులను తీసుకుంటే గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు మొదలై, ఘర్షణలు చెలరేగే ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరూ అపోహలకు పోవద్దని, కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, అవకాశాలు వస్తూనే ఉంటాయని, అప్పటి వరకూ వేచి చూడాలని దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన మాట వినేవారికే అవకాశం ఇస్తానని చెప్పినట్లు తెలిసింది.
అనంతగిరి: పనికోసం ఇంటి నుంచి వెళ్లిన కూలీ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సాలె రమేశ్ కుటుంబంతో కలిసి వికారాబాద్‌లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో అతని భార్య లలిత ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పీఎస్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.


