గెస్ట్ లెక్చరర్ నియామకాల్లో అవకతవకలు
తాండూరు టౌన్: అతిథి అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ ఆరోపించారు. ఇందులో జిల్లా నోడల్ అధికారి శంకర్‌నాయక్ పాత్రపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం తాండూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తాజా నియామకాల సందర్భంగా పదేళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న మహేశ్‌తో పాటు పలువురిని అకారణంగా తొలగించడం అన్యాయమన్నారు. అనుభవం, అర్హత ఉన్న అధ్యాపకులు ఏళ్ల తరబడిగా చాలీచాలని జీతానికి సేవలందిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారన్నారు. వారిని తొలగించడం సబబు కాదన్నారు. అతిథి అధ్యాపకుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్‌పై ఆరోపణలున్నాయని, తక్షణమే ఆయనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నాయకులు వెంకటేశ్, అనిత, జగదీశ్వరి, రాజు, జోసఫ్, బాబా గౌడ్, నరేందర్, రమేశ్, యాసర్ తదితరులు ఉన్నారు.
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్


