ఊరి సిత్రాలు చూడయా! | - | Sakshi
Sakshi News home page

ఊరి సిత్రాలు చూడయా!

Dec 8 2025 10:37 AM | Updated on Dec 8 2025 10:37 AM

ఊరి సిత్రాలు చూడయా!

ఊరి సిత్రాలు చూడయా!

యాచారం: రాజకీయాల్లో బద్ధ శత్రువులు.. శాశ్వత మిత్రులుండరని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరోసారి రుజువవుతోంది. పార్టీలో ఏళ్లుగా ఉంటూ పదవులు, గుర్తింపు పొందిన నేతలు స్వలాభం కోసం క్షణాల్లో మారిపోతున్నారు. డబ్బులు, అధికార ఆశతో పార్టీలో మర్యాద ఇవ్వడం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదనే సాకుతో బద్ధ శత్రువులకు మద్దతు ప్రకటిస్తున్నారు. యాచారం మండలంలోని మాల్‌, మొండిగౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, చింతపట్ల తదితర గ్రామాల్లో విచిత్ర పొత్తులతో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తర ంగా మారుతున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రధాన ప్ర త్యర్థులైన కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని సర్పంచ్‌ బరిలో నిలుపగా, మరికొన్ని ఊర్లల్లో పదేళ్లు అధికారంలోకి ఉన్నప్పటికీ సర్పంచ్‌ అభ్యర్థులు లేక ఇతర పార్టీల సర్పంచ్‌ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతిస్తున్న ఉదంతాలున్నాయి. కొన్నింటిలో బీజేపీ, సీపీఎంలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపడం గమనార్హం.

ప్రత్యర్థులకు మద్దతు

ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారన్న కారణంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలకంగా ఉన్న జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం హాట్‌ టాఫిక్‌గా మారింది. మొండిగౌరెల్లి గ్రామంలో అధికార పార్టీకి వింత అనుభవం ఎదురైంది. సర్పంచ్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున ఎవరూ పోటీ చేయకపోవడంపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పటికీ సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీలో లేకపోవడంపై ఆదివారం ఎమ్మెల్యే మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీలి బీజేపీ సానుభూతిపరులకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సైతం సర్పంచ్‌ ఎన్నికల్లో తటస్థంగా ఉంది.

ఇంటింటికీ ప్రచారం

బషీరాబాద్‌: మండలంలోని జీవన్గీ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి నర్సిములుకు మద్దతుగా గ్రామస్తులు, మహిళలు ఆదివారం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జాతరలా జనం వాడవాడలా తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. అభ్యర్థి కుటుంబ సభ్యులు ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదించాలని అభ్యర్థించారు.

సర్పంచ్‌ బరిలో విద్యావంతులు

కడ్తాల్‌: గ్రామ పంచాయతీ పోరులో విద్యావంతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మండల పరిధిలోని సాలార్‌పూర్‌ గ్రామ పంచాయతీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో సర్పంచ్‌ అభ్యర్థిగా కేతావత్‌ పద్మమోహన్‌ బరిలో ఉన్నారు. ఆమె పాలిటెక్నిక్‌ డిప్లామా పూర్తి చేశారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా అందరి సహకారంతో బరిలో దిగినట్లు తెలిపారు. గ్రామంలో విద్యా, వైద్యానికి కృషి చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ

పెద్దవేములోని బావితండాకు చెందిన రమావత్‌ గోపీనాయక్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుల మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చదువుకున్న యువకుడిగా తండా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే తండాలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు.

ఇసుకనే ప్రచారాస్త్రం

తాండూరు రూరల్‌: సర్పంచ్‌ ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో వింత ప్రచారాలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని గోనూర్‌, వీర్‌శెట్టిపల్లి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాపై అధికార, విపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. సర్పంచ్‌గా ప్రత్యర్థిని గెలిపిస్తే ఇసుకను తోడేస్తున్నారని ఆరోపించుకుంటున్నారు. ఈ రెండు గ్రామాల్లో ఇసుకనే ప్రచార అస్త్రంగా మారిందని ఆయా గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు.

ఓట్ల కోసం అభ్యర్థుల తంటాలు

ధారూరు: నామినేషన్ల ఘట్టం ముగియడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు అనుచరగణాలతో ఇంటింటికి వెళ్లారు. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లు మాత్రం మీకే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. తమ వెంట రోజు తిరిగే నాయకులు, కార్యకర్తలకు మద్యం, మాంసం, టిఫిన్లు తినిపిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈనెల 14వ తేదీ ఆదివారం వరకు సమయం ఉన్నా ఓటర్ల నాడిని మాత్రం ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. రోజు రోజుకు ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.

క్షణాల్లో కండువాలు మార్చేస్తున్న నాయకులు

తమ పార్టీలకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్న వైనం

విచిత్ర పొత్తులకు వేదికగాగ్రామ పంచాయతీ పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement