హకీంపేట్ రోల్ మోడల్ కాబోతోంది
దుద్యాల్: రాష్ట్రంలో హకీంపేట్ గ్రామం రోల్ మోడల్ కాబోతుందని గ్రామ సర్పంచ్ అభ్యర్థి రవీంద్ర నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మన ప్రాంతం వెనుకబడిందని, నిరుద్యోగం పెరిగి వలసలు వెళ్తున్నారని పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మెడికల్ కళాశాల, ఆస్పత్రి, సైనిక్ స్కూల్, ఇంజనీరింగ్, పశువైద్య కళాశాల, శంషాబాద్ నుంచి హకీంపేట్ వరకు 100 ఫీట్ల రోడ్లు నిర్మించడంతో పాటు అనేక రకాల అభివృద్ధి పనులు తీసుకువచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానన్నారు. గ్రామానికి రూ.ఆరు కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండలానికి ఒక పెట్రోల్‌బంక్ మంజూరైతే హకీంపేట్‌లోని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.
అన్నకే నా ఓటు
దుద్యాల్: ‘నా ఓటు నర్సింహారెడ్డి అన్నకే’ అంటూ ఏకంగా ఇంటిపై రాసుకున్న సంఘటన మండల పరిధిలోని హకీంపేట్ గ్రామంలో ఆదివారం కనిపించింది. గ్రామానికి చెంది రవీంద్ర నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచారు. ఓట్లు వేయాలని గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తన ఓటు నర్సింహారెడ్డి అన్నకే వేస్తానని గ్రామానికి చెందిన గుండెమోని రాములు తన ఇంటి గోడలకు బహిరంగంగా రాసుకోవడం గమనార్హం.


