రోడ్డు తవ్వేసి ఆందోళన
చందాలతో సీసీ రోడ్డు వేసుకుంటామన్న 7వ వార్డు ప్రజలు అధికారులు,ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం నిరసనకారులతో కాంగ్రెస్ నాయకుల మంతనాలు ఎమ్మెల్యే హామీతో శాంతించిన జనం
తాండూరు టౌన్: ఏళ్ల తరబడిగా రోడ్డు వేయా లని విన్నవిస్తున్నా మున్సిపల్ అఽఽధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన స్థానికులు చందాలు వేసుకుని రోడ్డును నిర్మించుకునేందుకు ప్రయత్నించా రు. ఈ క్రమంలో పాత రోడ్డును జేసీబీతో తవ్వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ ఘటన శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. 7వ వార్డుకు చెందిన ప్రజలు నూతన సీసీ రోడ్డు వేయాలంటూ రోడ్డెక్కారు. స్థానిక రాయల్ కాంటాపక్కనున్న మార్గంలోని పాత రోడ్డును జేసీబీతో తవ్వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా తమ వార్డులో సీసీ రోడ్డు వేయలేదన్నారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గెలిచి రెండేళ్లు కావస్తున్నా రోడ్డు సమస్యను పట్టించుకోలేదని తెలిపారు. దీంతో తామే చందాలు వేసుకుని పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రోడ్డును తవ్వినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. మున్సిపల్ అధికారులు వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ స్థానిక నాయకులు పట్లోళ్ల నర్సింలు వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. రూ.45 లక్షలతో రోడ్డు మంజూరైందని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని వారికి వివరించారు. అయితే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదన్నారు. ఇప్పటికే అతనికి మున్సిపల్ అధికారులు రెండు నోటీసులు ఇచ్చారని, మరో నోటీసు ఇచ్చి సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామన్నారు. అప్పటికీ స్థానికులు శాంతించక పోవడంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకుంటానని చెప్పడంతో స్థానికులు శాంతించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోతే మాత్రం తిరిగి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.
రోడ్డు తవ్వేసి ఆందోళన


