వామ్మో ఇవేం ధరలు!
మండిపోతున్న కూరగాయల రేట్లు పేద, మధ్య తరగతి ప్రజలపై భారం స్థానికంగా సాగులేక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
ధరలు బాగా పెరిగాయి
మార్కెట్లో కూరగాయల ధరలు బాగా పెరిగాయి. మూడు రోజుల క్రితం ఉన్న ధరలు నేడు అమాంతంగా పెరిగాయి. కిలోకు సుమారు రూ.10 నుంచి రూ.40 వరకు పెరిగాయి. ధరల పెరుగుదలను ప్రభుత్వం కట్టడి చేయాలి.
– పల్లవి, గృహిణి, దౌల్తాబాద్
దౌల్తాబాద్: కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శీతాకాలం ఆరంభంతోనే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న ధరలు.. రెండు మూడు రోజుల నుంచి పైకి ఎగబాకుతున్నాయి. ఒక్కో రకం కూరగాయల ధర కనిష్టంగా రూ.10 నుంచి రూ.30 వరకు పెరగడంతో పేద, మధ్య, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ రెక్కల కష్టమంతా కూరగాయలు కొనడానికే కూడా సరిపోయేటట్టు లేదని దిగులు చెందుతున్నారు. కాగా పాలకూర, పచిమిర్చి తోటకూరల ధరలు కాస్తా తగ్గుముఖం ఉండడంతో ఉపశమనం కలిగిస్తోంది.
తుపాన్ ప్రభావంతో..
పదిహేను రోజుల క్రితం ఏర్పడిన తుపాను ప్రభావంతో జోరు వానలు కురిశాయి. పత్తి, వరి తోపాటు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. భారీగా ఉత్పత్తులు పడిపోవడంతో గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు అరకొరగా సరఫరా అవుతున్నట్లు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు దిగుమతి కాకపోవడంతో ధరలు అమాంతంగా పెరిగినట్లు తెలుస్తోంది. పేద, సామాన్యులు, కూలీలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్పిడీపై కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మార్కెట్లలో రేట్లు ఇలా..
కూరగాయ రకం ప్రస్తుత రేటు 3రోజుల క్రితం
టమాటా 40 30
వంకాయ 80 60
బీరకాయ 80 60
కాకరకాయ 100 80
బెండకాయ 100 60
దొండకాయ 80 60
గోబీపువ్వు 80 60
వామ్మో ఇవేం ధరలు!


