ఘనంగా బిర్సా ముండా జయంతి
అనంతగిరి: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్ తెలిపారు. శనివారం ధర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా ఉన్నతాధికారులు తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లాలో 31 గిరిజన గ్రామాలను గుర్తించడం జరిగింది. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీఎంహెచ్‌ఓ డి.స్వర్ణకుమారి, బీసీడీఓ మాధవరెడ్డి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


