పాఠశాలల్లో సమస్యలు ఉండొద్దు
అనంతగిరి: జిల్లాకు మంజూరైన భవిత సెంటర్లకు సంబంధించిన నూతన భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ లు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల భవనాల మరమ్మతులు, యూనిఫాం, డ్రాప్ బాక్స్, విద్యుత్, టాయిలెట్స్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెద్దేముల్, తాండూరు, చౌడాపూర్ మండలాలకు భవిత కేంద్రాలు మంజూరైన నేపథ్యంలో భవన నిర్మాణ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూల్ బిల్లిండ్‌లపై వర్షపునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం వేయరాదన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా బోధన చేయాలని తెలిపారు. ఎంఈఓలు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. వసతి గృహాలకు, పాఠశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఈఓ రేణుకాదేవి, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, ఎంఈఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


