పంట కొనం.. పరిహారం ఇవ్వం
‘ఫార్మాసిటీ కోసం పరిహారం ఇచ్చి, భూములు సేకరించాం. అవి ఇప్పుడు మీవి కానేకావు. మీ పేరిట రికార్డులు లేవు.నిబంధనలకు విరుద్ధంగా పంటలు వేశారు. ఆ ఉత్పత్తులను కొనే ప్రసక్తే లేదు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చేది లేదు’ అని వ్యవసాయ శాఖ స్పష్టం చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
యాచారం: ఫార్మాసిటీకి మండల పరిధి నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,500 ఎకరాలకు పరిహారం ఇచ్చి కొనుగోలు చేసింది. ఆ భూముల్లో ఎవరూ పంటలు వేయరాదని వానాకాలం ప్రారంభంలో.. వ్యవసాయ శాఖ నాలుగు గ్రామాల(ఫార్మాసిటీకి సేకరించిన భూముల) రైతులకు తెలిపింది. వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేసింది.
అమ్మిన భూమిలో సాగు చేస్తూ..
ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఐదు వేలకు పైగా మంది రైతులు.. రూ.లక్షలు వెచ్చించి 7,500 ఎకరాల భూమితో పాటు.. రైతుల పరిహారాన్ని అథారిటీలో జమ చేసిన 2,211 ఎకరాల పట్టా భూముల్లో పత్తి, వరి, కూరగాయలు తదితర పంటలను సాగు చేస్తూ.. మొన్నటి వరకు ఏటా ఆదాయం పొందుతూ వచ్చారు. ఇప్పుడు కొనబోమని సర్కారు స్పష్టం చేయడంతో ఆందోళన చెందుతున్నారు.
5 వేల ఎకరాల్లో పత్తి
సుమారు పది వేల ఎకరాల్లో 5 వేల ఎకరాలు పత్తి, రెండు వేల ఎకరాలు వరి, కూరగాయల పంటలు, మిగతా మూడు వేల ఎకరాల్లో మెట్ట పంటలతో పాటు పాడి, పశువుల పశుగ్రాసానికి ఉపయోగిస్తున్నారు. ఫార్మాసిటీకి సేకరించడానికి ముందు వ్యవసాయ భూముల్లో వేసిన బోరుబావుల ద్వారానే సాగు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఫార్మాకు భూములిచ్చి, మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ వెంచర్‌లో ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లుపొందారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మళ్లీ అవే భూముల్లో రైతులు సాగు చేస్తూ.. ఆదాయంపొందుతున్నారు.
పత్తి, ధాన్యం నిషేధం
తాజాగా సీసీ కేంద్రాల్లో పత్తి విక్రయాల కోసం ముందుగానే స్లాటు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. రైతు పేరు, సర్వే నంబరు, గ్రామం పేరును మొబైల్ ఫోను నంబరులో కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి విక్రయించే విధానానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. నిషేధిత జాబితాలోని నాలుగు గ్రామాల రైతులకు చెందిన భూ రికార్డులు వారి పేరిట లేకపోవడంతో.. స్లాట్ బుకింగ్‌ను నిషేధించారు. పత్తి విక్రయాలతో పాటు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ.. ఈ జాబితాలో ఉండి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
పొలాల వద్దకు వ్యాపారులు
నిషేధిత జాబితాలోని భూముల్లో పండించినఉత్పత్తుల కొనుగోలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనినే ఆసరాగా తీసుకున్న దళారులు.. ఫార్మా భూముల్లో పంటల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారు. తక్కువ ధరకే దక్కించుకునేందుకు పొలాల్లో వాలిపోతున్నారు. సీసీఐ కేంద్రాల్లో క్వింటాల్ పత్తి ధర రూ.8 వేలకు పైగా ఉన్నప్పటికీ.. కేవలం రూ.5, 6 వేలకే కొనుగోలుచేస్తున్నారు. ప్రభుత్వం కొనడం లేదు. వర్షంవెంటాడుతోంది. దీంతో చేసేది లేక రైతులు.. దళారులకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఆ గ్రామాల్లో సుమారు పది వేల క్వింటాళ్ల పత్తి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంకా వేలాది క్వింటాళ్లు రైతుల వద్దే ఉండిపోయింది. ధాన్యాన్ని కూడా దళారులకే అమ్మేస్తున్నారు.
ముందే చెప్పాం..
వానాకాలం ప్రారంభంలో నిషేధిత జాబితాలోని ఫార్మాసిటీ భూముల్లో పంటలు సాగు చేయరాదని రైతులకు ముందే చెప్పాం. విస్తృతంగా ప్రచారం చేశాం. అయినా నిబంధనలకు విరుద్ధంగా సాగు చేశారు. ఇప్పుడు ఆ భూముల్లో పత్తి పండించిన వారికి స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. వరిని కొనం. పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వం.
– రవినాథ్, వ్యవసాయాధికారి, యాచారం
భూమి ఇవ్వకపోయినా.. పంటను కొనరా?
– భగవంత్‌రెడ్డి, రైతు నానక్‌నగర్
ఫార్మాసిటీకి నేను భూమి ఇవ్వలేదు. 56,71,86 సర్వే నంబర్లల్లోని 15 ఎకరాల్లో పత్తి, వరి పంటను పండించాను. ఇందుకు రూ.రెండున్నర లక్షలు ఖర్చు చేశాను. తీరా పత్తిని సీసీఐ కేంద్రాలకు తరలించి, అమ్ముదామంటే.. ‘నీ పేరిట భూ రికార్డులు లేవు.అందుకే కపాస్ కిసాన్ యాప్‌లో స్లాటుబుకింగ్ కావడం లేదు’ అని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. భూమి ఇవ్వకపోయినా.. నా ఉత్పత్తులను విక్రయించే హక్కులేదా.ఇదెక్కడి అన్యాయం.
ఫార్మా భూములపంటలపై నిషేధం
దిగుబడులనుకొనుగోలు చేయని ప్రభుత్వం
వర్షాలకు నష్టపోయినా.. పరిహారం సున్నా
ఆందోళన చెందుతున్న రైతులు
కొనసాగుతున్న దళారుల ఇష్టారాజ్యం


