జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
అనంతగిరి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల శివారెడ్డిపేట్(అనంతగిరిపల్లి)లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను డీసీఓ సాయిలత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డీసీఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు కూడా అవసరమన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటలతో పాటుగా విద్యలో రాణించి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. ముందుగా శివారెడ్డిపేట్ పాఠశాల విద్యార్థులు నృత్యం చేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


