ప్రజల ప్రాణాలతో చెలగాటమొద్దు
అనంతగిరి: రోడ్డు ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు పోతున్నా ఎవరికీ పట్టడం లేదని విద్యార్థి, కుల సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలో సకల జనుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మీర్జాగూడ బస్సు ప్రమాద మృతులకు నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సూచించారు. అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదని మండిపడ్డారు. బస్సు ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవాణా, ఆర్టీసీ శాఖల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రవాణా శాఖ మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మన్నెగూడ – హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్టు వేయాలని కోరారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అనిప్రశ్నించారు. రాజకీయాలు పక్కన పెట్టి రోడ్లను బాగు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఐఎంఏ వికారాబాద్ సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, నాయకులు శంకర్, మోహన్‌రెడ్డి, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన రోడ్డు పనులు పూర్తి చేయాలి
లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం
విద్యార్థి సంఘాల నాయకులు
బస్సు ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి


