డ్రగ్స్, గంజాయి దందా.. ఆరుగురి అరెస్ట్
రాజేంద్రనగర్: ఇన్‌స్ట్రాగామ్ ద్వారా చాటింగ్ చేసి బెంగుళూర్‌కు వెళ్లి డ్రగ్స్‌తో పాటు గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు యువకులతో పాటు డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని రాజేంద్రనగర్, మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ, 150 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.9,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కాకినాడకు చెందిన ఎస్.సంతోష్ (26)గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డాడి మడుగు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతనికి బెంగుళూర్‌కు చెందిన నర్సరీ వ్యాపారం నిర్వహించే గాంధీ సందీప్ (23), రాజమండ్రికి చెందిన లారీ డ్రైవర్ శివ కుమార్ (23) స్నేహితులయ్యారు. వీరంతా కలిసి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తితో చాటింగ్ చేశారు. డ్రగ్స్ కావాలని తెలపడంతో డబ్బు ఆన్‌లైన్ ద్వారా వేశారు. అనంతరం బెంగుళూర్‌కు వచ్చి డ్రగ్స్‌ను తీసుకోవాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఇన్‌స్ట్రాగామ్ చాట్ ద్వారా డ్రగ్స్ సప్లాయర్ పోస్టు చేసిన లోకేషన్‌కు వెళ్లి రోడ్డు పక్కనే భద్రపరిచిన డ్రగ్స్‌తో పాటు గంజాయిని తీసుకొని నగరానికి పయనమయ్యారు. డ్రగ్స్ విక్రయించిన వ్యక్తి నైజీరియన్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఆరాంఘర్ బస్టాపు వద్ద ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్‌తో పాటు గంజాయి లభ్యమైంది. అప్పటికే వీటిని తీసుకొనేందుకు సాయిబాబా (25), విశాల్ రెడ్డి (28), తన్వీర్ (24) ఆరాంఘర్ వద్దకు వచ్చారు. వీరిని సైతం అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు.


