కళాశాలలు తరలించొద్దు
కొడంగల్ రూరల్: మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు తరలించొద్దని పట్టణంలోని కడా కార్యాలయ ఆవరణలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలకు వేరువేరుగా కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ కో కన్వీనర్లు సురేష్‌కుమార్, శ్రీనివాస్, రమేష్‌బాబు, భీమరాజు, సూర్యానాయక్ మాట్లాడారు. మెడికల్ కళాశాలలు, సమీకృత గురుకులాలను ఇతర ప్రాంతాలకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. కొడంగల్‌లోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, విద్య, వైద్యం అందక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇంతకు మించిన కళాశాలలు ఇక్కడికి వస్తాయని చెప్పడంతో కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నిర్ణయించిన స్థలంలో కేవలం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చంద్రయ్య, రమేష్‌బాబు, డాక్టర్ నవాజ్, పవన్, పకిరప్ప, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


