
పట్టుదల ఉంటే.. విజయాలు వెంటే
షాద్‌నగర్‌రూరల్: కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయని మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజినీరింగ్ కళాశాలలో.. గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘స్వయం ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి’ శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జీవిత గమనంలో ఎదురయ్యే సవాళ్ల ఎదుర్కొన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. విద్యార్థులు చదువులో రాణిస్తూ.. వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకు కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే విజయతీరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. లక్ష్య సాధనకు ప్రణాళికలను రూపొందించుకొని, నిరంతరం శ్రమించాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ నీతాపోలె మాట్లాడుతూ.. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కళాశాల స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని కల్పించుకునే దిశగా ప్రేరణనిస్తాయ పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రవికుమార్