
త్వరలో పరిగికి రైలు కూత
పరిగి:త్వరలో పరిగికి రైలు కూత వినిపించనున్నట్లు ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం నిధులు మంజూరు చేశాయన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గత ప్రభుత్వం పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను సిద్దిపేటకు మళ్లీంచారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రైల్వే లైన్‌కు మళ్లీ ప్రాణం పోశారని పేర్కొన్నారు. ఈ నెల 16న జరిగిరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ భూ సేకరణ కోసం రూ.438 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో పరిగి మీదుగా పనులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. అలాగే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైందన్నారు. ఈ పనులు పూర్తయితే పరిగి నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు పోటీకి అర్హులని నిర్ణయం తీసుకోవడంతో ప్రజల్లో సంతోషం నింపిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ నెల 18న నిర్వహించే బీసీ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు ఆంజనేయులు, సర్వర్, శ్రీనివాస్, జగన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.