
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారులు
పరిగిలోని అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధఖ శాఖ దాడులు ఎఫ్‌ఆర్‌ఓతో పాటు డ్రైవర్ అరెస్ట్ మరో ఎఫ్‌ఆర్‌ఓను నగరంలో అదుపులోకి..
సీతాఫలాల తరలింపు పర్మిట్లకు లంచం డిమాండ్
పరిగి: సీతాఫలాలు తరలించే వాహనాలకు పర్మిట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అటవీశాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పరిగిలోని ఫారెస్ట్ ఆఫీస్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మూడు మండలాల్లో సీతాఫలాల సేకరణ టెండర్‌ను రూ.18 లక్షలకు ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అడవి నుంచి సేకరించిన సీతాఫలాలను నగరానికి తరలించేందుకు అవసరమైన వాహనాల పర్మిట్ల కోసం కుల్కచర్ల, కుస్మసముద్రం సెక్షన్ ఆఫీసర్లు మొయినుద్దీన్, సాయికుమార్‌ను సంప్రదించగా, ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చెట్ల నుంచి తెంపిన కాయలు, పండ్లను తరలించే అవకాశం లేక పాడవుతున్నాయి. దీంతో వ్యాపారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తన సమస్యను పరిష్కరించమని అధికారులను వేడుకోగా రూ.50 వేలు డిమాండ్ చేశారు. చివరికి రూ.40 వేలకు డీల్ కుదుర్చుకున్న కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం పరిగి ఆఫీసులో ఉన్న సెక్షన్ ఆఫీసర్ మొయినుద్దీన్ తన డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఫారెస్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణకు హాజరైన సాయికుమార్‌ను అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.