
రాజీనామా.. ఆమోదం
పదవి నుంచి తప్పుకొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
వికారాబాద్: అందరూ ఊహించినట్లే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమోదించడం చకచకా జరిగిపోయింది. దీంతో కొంత కాలంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. జిల్లా అధ్యక్షుడి మధ్య ఉన్న వివాదం ముగిసినట్లుయ్యింది. గ్రూపు తగాదాలతో విసిగిపోయిన రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేయగా శుక్రవారం ఆమోదించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతు న్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం తాత్కా లికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.గతంలో జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన పార్టీ సీనియర్ నేత కరణం ప్రహ్లాద్‌రావును జిల్లా కన్వీనర్‌గా నియమించారు. కొత్త అధ్యక్షుడు వచ్చే దాకా పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకోనున్నట్లు తెలిసింది.
ఆరు నెలలకే ఊడిన పదవి
గతంలో ఎప్పుడూ లేని విధంగా స్థానికేతురుడికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆరు నెలలకే రాజీనామా చేయించింది. సిఫారసు చేసిన ఎంపీనే అతన్ని మార్చడంలో ప్రధాన పాత్ర వహించారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొనడం గమనార్హం. ఆయన అన్నట్లుగానే రాజీనామా చేశారు. రాజశేఖర్‌రెడ్డి జిల్లా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య సఖ్యత లేదు. మొదట్లో పార్టీ సీనియర్ నేతలు వర్సెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యవహారం చివరకు కొండా వర్సెస్‌గా మారిపోయింది. జిల్లా కమిటీ ఏర్పాటు సమయంలో రాజశేఖర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని, కొంతమంది సీనియర్ కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.
రేసులో పలువురు నేతలు..
జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సిఫారసు చేసిన వారికే అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సదానంద్‌రెడ్డి, తాండూరుకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు రమేశ్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నుంచి పోటీ చేసిన పరమేశ్వర్‌రెడ్డి పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. ఎంపీ అనుచరుడిగా పేరున్న పరమేశ్వర్‌రెడ్డికి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాల్సి వస్తే రమేశ్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.