
హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని..
భవనం మొదటి అంతస్తు పైనుంచి దూకిన విద్యార్థి మంబాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే వసతిగృహంలో ఘటన టీసీ ఇవ్వకపోవడంతోనే దూకానంటున్న బాలుడు
తాండూరు రూరల్: హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేని ఓ విద్యార్థి భవనం మొదటి అంతస్తు పైనుంచి కిందికి దూకాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బ యటపడ్డాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం మంబాపూర్ సమీపంలోని మహాత్మ జ్యోతి బాపూ లే గురుకుల బాలుర వసతిగృహంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వసతి గృహం అధికారులు, విద్యార్థి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ధారూరు మండలం కొండాపూర్‌కలాన్ గ్రామానికి చెందిన విరాట్ ఆరో తరగతి చదువుతున్నాడు. గతేడాది ఇక్కడే ఐదో తరగతి పూర్తి చేశాడు. తనకు హాస్టల్ లో ఉండటం ఇష్టం లేదంటూ కొద్ది రోజులుగా మారాం చేస్తున్నాడు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లి న విరాట్ అయిష్టంగానే హాస్ట ల్‌కు వచ్చాడు. తాను వెళ్లనని చెప్పినా ఈసారి ఆరో తరగతి పూర్తి చేస్తే వచ్చే ఏడాది నీకు నచ్చిన చోట చేర్పిస్తామని బుజ్జగించిన తల్లిదండ్రులు గత మంగళవారం అతన్ని హాస్టల్‌లో వదిలివెళ్లారు. మూడు రోజులు బాగానే ఉన్న విరాట్ శుక్రవారం సాయంత్రం హాస్టల్ భవనం మొదటి అంతస్తు పైనుంచి దూకాడు. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని తాండూరు పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. హాస్టల్‌పై నుంచి దూకడంతో విరాట్ తలకు గాయమైంది. పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో హాస్టల్ అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తనకు హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని, టీసీ అడిగితే ఇవ్వకపోవడంతోనే భవనం పైనుంచి దూకానని విద్యార్థి తెలిపారు. ఈ విషయమై హాస్టల్ అధికారులు శనివారం పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.