
ప్రపంచానికి ఆదర్శంగా భారత్
అనంతగిరి: ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలన్ (కవాతు) వికారాబాద్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా భారీ కవాతు నిర్వహించారు. పట్టణంలోని కొత్తగంజ్ నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా సాగింది. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సద్భావన సహ ప్రముఖ్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఽహిందూ ధర్మ పరిరక్షణకు ఆర్‌ఎస్‌ఎస్ పాటుపడుతుందన్నారు. ఈ దేశానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. యావత్ ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన ఘనత భరత భూమికే దక్కుతుందన్నారు. హిందూ సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని.. రాబోయే రోజుల్లో ప్రపంచానికే దేశం ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్ సత్యనారాయణగౌడ్, సహ సంఘచాలక్ గోవర్ధన్‌రెడ్డి, ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్ కూర జయదేవ్, సంఘ పెద్దలు, పట్టణ ప్రముఖులు, స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.