
యూరియా కొరత.. రైతన్న వెత
క్యూలైన్‌లో తోపులాట
వానాకాలం పంటల ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరినాట్లు వేసే పనులు మొదలవడంతో యూరియా కోసం పనులు మానుకుని సహకార సంఘాల వద్దకు పరుగులు పెడుతున్నారు. రోజుల తరబడి నిరీక్షించినా ఒక్కొక్కరి ఒక్కో బస్తా ఇచ్చి పంపుతున్నారు. దీంతో రై తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
తాండూరు రూరల్: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎఫ్‌ఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రైతుల మధ్య తోపులాట జరిగి జనగాం గ్రామానికి చెందిన పెద్ద మల్లప్ప స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో అధికారులు టోకెన్లు జారీ చేశారు. అయితే ఒక్కరికి ఒకే బస్తా ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరినాట్లు వేసుకుంటున్నామని యూరియా సరిపోవడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై ఏఓ పవన్ ప్రీతంను వివరణ కోరగా.. పెద్దేముల్ ఎఫ్‌ఏసీఎస్‌కు 10 మెట్రిక్ టన్నుల యూరియా(200) బస్తాలు వచ్చాయన్నారు. యూరియా కొరత విషయమై జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లామని, మరో 200 బస్తాల యూరియా త్వరలో వస్తోందన్నారు.
ఐదు సంచుల కోసం ఆందోళన
ధారూరు: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా సోమవారం ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున యూరియా పంపిణీ చేశారు. త మకు కనీసం ఐదు సంచుల చొప్పున ఇవ్వాలని రై తులు పట్టుబట్టారు. ఉదయం 6 గంటలకే తిండితిప్పలు లేకుండా క్యూ కట్టిన రైతన్నలకు ఒక్కో సంచి మాత్రమే ఇస్తామని సీఈఓ, సిబ్బంది తెలపడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పినా వినకుండా కార్యాలయంలోకి చొచ్చుకుపోయారు. రైతులను శాంతింపజేసేందు కు రెండు సంచుల చొప్పున ఇస్తామని సీఈఓ అంగీకరించారు. పోలీసుల సమక్షంలో ప్రశాంతంగా పంపిణీ చేశారు.