
అధికారులదే బాధ్యత
కొడంగల్ రూరల్: కడా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. సోమవారం పట్టణంలోని కడా కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించి నిధులు మంజూరు చేసిందన్నారు. పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినా పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాఠశాలల్లో మోడ్రన్ టాయిలెట్స్ నిర్మించాలన్నారు. కేజీబీవీల్లో విద్యార్థుల అవసరాలకు అనుగునంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్, మిషన్ భగీరథ, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో రహదారుల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ హర్షచౌదరి,కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ సత్యనారాయణ, సీపీఓ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ రవికుమార్, జిల్లా అటవీశాఖాధికారి జ్ఞానేశ్వర్, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.