
కారంచేడు పోరాటం స్ఫూర్తిదాయకం
తాండూరు టౌన్: కారంచేడు దళితుల పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని కుల నిర్మూలన పోరాట సమితి(కేఎన్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు జయరాజ్ అన్నారు. గురువారం కేఎన్‌పీఎస్ ఆఽధ్వర్యంలో తాండూరులో కారంచేడు మృతవీరుల సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1985 జూలైలో ఉమ్మడి ఏపీలోని ప్రకాశం జిల్లాలో తాగునీటిని కలుషితం చేసిన విషయమై ప్రశ్నించిన కారంచేడు గ్రామానికి చెందిన పలువురు దళితులను అనాగరికంగా నరికి చంపారన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే భేదం లేకుండా కత్తులతో నరికి తీవ్ర గాయాలపాలు చేశారన్నారు. దీంతో అట్టుడికిన దళితులు నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ ఏళ్ల తరబడిగా పోరాటం చేశారన్నారు. వారి పోరాట ఫలితంగా ఎట్టకేలకు సుప్రీంకోర్టు నిందితులకు శిక్ష విధించిందన్నారు. కారంచేడులో దళితులపై జరిగిన నరమేధానికి వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రూపుదాల్చుకుందన్నారు. నాటి నుంచి దళితులు అగ్రకులాల పెత్తందారితనాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏర్పుల చంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభినవ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమాల్ అతర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు బసయ్య తదితరులు పాల్గొన్నారు.
కేఎన్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జయరాజ్