
పవిత్రోత్సవాలకు రండి
● సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ధర్మకర్తలు
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి నిర్వహించే పవిత్రోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, నందారం మధు, ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. మూడు రోజుల పాటు వైభవంగా పూజలు జరుగుతాయని తెలిపారు. తిరుమల తిరుపతి తరహాలోనే వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని చెప్పారు. 20వ తేదీ ఉదయం 9గంటలకు ఉత్సవ మూర్తులకు శతకళశ తిరుమంజనం, మధ్యాహ్నం 12గంటలకు అగ్ని ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవి త్ర ప్రతిష్ఠ, రాత్రి 7గంటలకు కుంభావాహన, విశేష హోమాలు, 21వ తేదీ ఉదయం 9గంటలకు విశేష ఉక్త హోమాలు, పవిత్ర సమర్పణ, రాత్రి 8గంటలకు విశేష హోమాలు, 22వ తేదీ ఉదయం 9గంటలకు విశేష హోమాలతో పాటు పవిత్రోత్సవం, అష్టోత్ర శత అష్టదళ పద్మారాధన, పవిత్రోత్సవ మహా పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు కుంభ బింబ ప్రదక్షిణము, ప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. శ్రీవారిని దర్శించుకోడానికి తాను వస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు.