
నేలమాలిగలు
ఉల్లి నిల్వకు
● ధర లేకపోవడంతో పంట స్టోరేజీకి ప్రాధాన్యం ఇస్తున్న రైతులు
● పొలాల్లోనే నేలమాలిగల తయారీ
● ప్రభుత్వమే షెడ్లు నిర్మించాలని అభ్యర్థన
మోమిన్‌పేట: సరైన ధరలు లేకపోవడంతో ఉల్లి పంటలను నిల్వ చేసేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు స్టోరేజీల్లో నిల్వ చేసేందుకు ఎక్కువ ఖర్చవడం వంటి కారణాలతో పొలాల వద్దే నేలమాలిగలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
తయారీ ఇలా..
చుట్టూ గుంజలు(బలమైన కట్టెలు) పాతి, నిలువుగా కంది కట్టె కడుతారు. మధ్యలో గ్రానైట్ రాళ్లు పెట్టి, వీటిపైనుంచి కట్టెలు పెడుతారు. ఆతర్వాత కంది పొరక, వరి గడ్డితో నింపుతారు. అనంతరం ఉల్లిగడ్డ వేసి, గడ్డి, ఆకులతో కప్పు వేస్తారు. దీనిపైనుంచి టార్పాలిన్ వంటి కవర్లతో కప్పేస్తారు. ఇలా అన్ని దిక్కుల నుంచి వెలుతురు, గాలి తగిలేలా చూసుకుంటారు.
ఆగస్టు, సెప్టెంబర్‌లో బయటకు
మేకవనంపల్లి, రాళ్లగుడుపల్లి, కాస్లాబాద్, ఏన్కతల, దేవరంపల్లి, మోమిన్‌పేట, ఏన్కెపల్లి, కోల్కుంద గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. జనవరిలో నాటిన ఉల్లిని ఏప్రిల్ చివరన, మే మొదటి, రెండో వారంలో బయటకు తీస్తారు. ఈ సమయంలో మంచి రేటు పలికితే ఆరబెట్టి మార్కెట్‌కు తరలిస్తారు. లేదంటే నేలమాలిగల్లో నిల్వ చేస్తారు. మంచి ధర పలికే సమయంలో బయటకు తీసి విక్రయిస్తారు. సుమారు మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచుతారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అమ్మేస్తారు. అప్పుడు కూడా సరైన ధర లేకపోతే మరికొంత సమయం వేచి చూస్తారు.
తక్కువ ఖర్చు...
ఎకరా పొలంలో సాగు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు నేలమాలిగలు తయారు చేసేందుకు సుమారు రూ.4 వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. స్వయంగా పనిచేసుకుంటే ఇది మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పలుకుతోందని ఈ సమయంలో అమ్ముకుని నష్టపోయేకన్నా.. ఇలా చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు.
వర్షాలు, తుపాన్లతో ఇబ్బంది
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన తీరులో నిల్వ చేయకపోతే పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసినా, రోజుల తరబడి తుఫాన్ ఉన్నా ఇబ్బందే. దీనికి తోడు నేలమాలిగలకు అగ్ని ప్రమాదాలతో నష్టం కలుగుతుంది. బీడీ, సిగరెట్ ముక్కలు కాల్చి పడేయటం వలన ఇలాంటివి సంభవిస్తుంటాయి.
షెడ్లు నిర్మిస్తే మేలు
మహారాష్ట్రలో మాదిరిగా ఉల్లి సాగు చేసే రైతులకు ప్రభుత్వమే అండర్ గ్రౌండ్ షెడ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో వీటిని నిర్మించడం ద్వారా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. రైతులకు కూడా పంట నష్టం వాటిల్లకుండా ఉంటుంది.
ధర తక్కువగా ఉండటంతో..
నేను రెండెకరాల్లో ఉల్లి సాగు చేశా. సుమారు 22 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ధర లేకపోవడంతో నేలమాలిగ తయారు చేయించా. ఇందులో నిల్వ చేసి ధర పెరిగిన తర్వాత విక్రయిస్తా.
– నారాయణరెడ్డి, రైతు, ఏన్కతల

నేలమాలిగలు