
రైతులతో మమేకం.. సాగుకు సన్నద్ధం
కొడంగల్ రూరల్: రైతులకు మేలైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా వానాకాలం సాగుకు సమాయత్తం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం(తాండూరు ఏరువాక కేంద్రం) ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులను నియోజకవర్గంలో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. సదస్సులకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులతో ఆధునిక వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, భూసార పరీక్షలు, పంట మార్పిడి పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలతోపాటు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పంటల సాగులో మెలకువలపై సూచనలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ నెల 13వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఆరుసూత్రాలతో సాగు బాగు
రైతులు తక్కువ ఖర్చుతో ఆరు సూత్రాలను ఆచరించి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడితోపాటు ఆర్థికంగా లాభాలు గడించే అవకాశం ఉంటుందని సదస్సుల ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చు తగ్గించుకోవడం, అవసరమైనంతలోనే రసాయనాలను వినియోగించడం, రశీదులను భద్రపరచడం, కష్టకాలంలో నష్ట పరిహారం పొందడం, సాగునీరు ఆదా చేయడం, భావి తరాలకు అందించడం, పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందడం, పొలం గట్లపై చెట్లను పెంచడం పర్యావరణ సమతుల్యత కాపాడడం వంటి ఆరు సూత్రాలతో అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ సదస్సులను నిర్వహిస్తున్నారు. దీంతో వ్యవసాయ పద్ధతుల్లో విశేష మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆరుగాలం శ్రమించిన కర్షకులు పేర్కొంటున్నారు.
ఉత్సాహంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
వానాకాలం సాగుపై అవగాహన
గ్రామాల్లో కొనసాగుతున్న సదస్సులు
విశేష స్పందన
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో వ్యవసాయాధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతులకు మేలైన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరిస్తున్నాం. సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
– శంకర్ రాథోడ్, ఏడీఏ, కొడంగల్

రైతులతో మమేకం.. సాగుకు సన్నద్ధం