
బాల్య వివాహాలు నేరం
● ప్రోత్సహించినా, సహకరించినా చర్యలు తప్పవు
● ధారూరు ఎస్‌ఐ అనిత
ధారూరు: సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ధారూరు ఎస్‌ఐ అనిత సూచించారు. కేరెళ్లిలోని సత్యసాయి సార్వజనిక కేంద్రంలో సోమ వారం కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవగాహన లేక అనేక మంది సైబర్ నేరాల బారిన పడి నష్టపోతున్నారని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, వీటిని ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వివాహాలు చేసుకునే యువతీ, యువకులకు 18, 21 సంవత్సరాలు నిండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సార్వజనిక కేంద్రం సభ్యులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కుక్కకాటు నిర్లక్ష్యానికి ప్రాణం బలి
తాండూరు రూరల్: రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం ఇందూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రవీణ్(32) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం కుక్క కాటుకు గురయ్యాడు. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు రావడంతో ఆదివారం ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. పరీక్షించి వైద్యులు ప్రవీణ్‌కు రేబిస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు సోమవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.