
సిరులు కురిపిస్తున్న మూసీ!
నవాబుపేట: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రధాన జల వనరైన మూసీ నది మే నెలలో సైతం నీటితో కళకళలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గతంలో ఎన్నడూ లేనంతగా నది పారుతుంది. దీంతో పరీవాహక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే పశువులకు సైతం చుక్క నీరు లభించని మూసీ వాగులో ప్రస్తుతం జల సిరులు సందడి చేస్తున్నాయి. దీంతో ఎందరో రైతుల బతుకులకు భరోసా ఏర్పడింది. నవాబుపేటమండలంలో సుమారు 20 కిలో మీటర్ల పొడవునా మూసీ ప్రవహిస్తుంది. ఏటా సంక్రాంతి వచ్చే సరికి వాగులో చుక్క నీరు ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం వేసవిలో భారీ వర్షాలు కురవడంతో నది(వాగు) ఇంకా పారుతుంది. ఆ నీటిని సాగుకు ఉపయుక్తంగా స్థానిక కర్షకులు చేసుకొని ఉపాధి పొందుతున్నారు.
500 ఎకరాల్లో కూరగాయల సాగు
మండలంలోని చించల్‌పేట, అత్తాపూర్, చిట్టిగిద్ద, అక్నాపూర్, పులుమామిడి, నారెగూడ, లింగంపల్లి, గొల్లగూడ, గంగ్యాడ, ఎల్లకొండ, గుబ్బడిపత్తేపూర్, ముబారక్‌పూర్ గ్రామాల భూములు మూసీ నది పక్కన ఉన్నాయి. దీంతో ఆయా రైతులు మూసీ నది కింద దాదాపు 500లకు పైగా ఎకరాల్లో వరి, జొన్న, పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈసారి వేసవిలో సైతం అప్పుడప్పుడు భారీ వర్షాలు కురవడంతో ప్రస్తుతం మూసీలో నీటి నిల్వలు ఉన్నాయి. ఫలితంగా రైతులు ఆ నీటిని ఉపయోగించుకుంటూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాలు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నాయి.
వేసవిలోనూ ఇంకిపోని నది
పంటలతో కళకళలాడుతున్న పరీవాహక ప్రాంతాలు
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

సిరులు కురిపిస్తున్న మూసీ!