
నేడు ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: పట్టణంలోని ఆదర్శ తులసీనగర్‌లో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, 7 గంటలకు ధ్వజారోహణం, 8 గంటల వరకు అభిషేకం, 9.30 గంటల వరకు భగవద్గీత పారాయణం, గణపతి హోమం, 10.30 గంటల నుంచి భక్త సురేష్ ప్రవచనం, అనంతరం పేరిణి శివతాండవం నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి మహాప్రసాద వితరణ జరుపనున్నట్లు తెలిపారు. కావున భక్త జనులందరూ వార్షికోత్సవానికి హాజరై స్వామి వారి కరుణాకటాక్షాలు పొందాలని కోరారు.
రేపు టీబీ ముక్తభారత్ అభియాన్
దౌల్తాబాద్: మండలంలోని మాటూరు గ్రామంలో ఈనెల 27న మంగళవారం టీబీ ముక్తభారత్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నివారణపై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిణి అమూల్య తెలిపారు. ఈ శిబిరంలో వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. రెండు వారాలు జ్వరం, ఛాతిలో నొప్పి ఉన్నవారు పరీక్షించుకోవాలన్నారు. ఈ శిబిరానికి జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి రవీందర్‌యాదవ్ హాజరవుతారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
మందుల పిచికారీతో ఎండిన పంట
పరిగి: ఫర్టిలైజర్ మందుల దుకాణదారుడి నిర్వాకంతో ఓ రైతు పంటను ఎండ బెట్టుకున్న సంఘటన మండల పరిధిలోని రాఘవపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు తనకున్న 15 గుంటల పొలంలో కొత్తిమీరను సాగు చేశాడు. పంట చేతికి వచ్చిన సమయంలో ముందు జాగ్రత్తగా శనివారం పట్టణ కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో మందులను కొనుగోలు చేసి పంటపై పిచికారీ చేశారు. మరుసటి రోజు కొత్తిమీర ఎండు ముఖం పట్టింది. దీంతో రైతు దుకాణదారుడి దగ్గరకు వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో నిర్వాహకులు రైతుతో వాగ్వాదానికి దిగి బెదిరించారు. చేతికి వచ్చిన పంట నాశనం అయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. ఈ సంఘటన శనివారం రాత్రి శ్రీశైలం హైవే రాచులూరు గేట్ సమీపంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న గుమ్మడవెల్లి అటవీ శాఖ అధికారి విజయ్‌భాస్కర్ సిబ్బందితో ఆ జింకను రాచులూరు పశువైద్యశాలకు తరలించారు. కాగా పశువైద్యుడు డాక్టర్ షాహీన్‌షేక్ ఆ జింకకు పోస్టుమార్టం నిర్వహించి, అటవీ అధికారులకు అప్పగించగా దానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు.

నేడు ఆలయ వార్షికోత్సవం

నేడు ఆలయ వార్షికోత్సవం