
ఘనంగా సామూహిక కుంకుమార్చన
కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయంలో ఆదివారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ భజన మండలి ఆధ్వర్యంలో లింగాష్టక పారాయణం, అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీమాణికేశ మహాసంస్థాన్ పీఠాధిపతులు శంకర్ స్వామిజీ ఆధ్వర్యంలో పార్వతీమాత అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి 201మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన చేశారు.
భక్తిభావవనతో ఏదైనా సాధ్యం
భారతదేశం సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయమని శ్రీమాణికేశ మహాసంస్థాన్ పీఠాధిపతులు శంకర్ స్వామిజీ అన్నారు. భక్తిభావనతో ఏదైనా సాధించవచ్చని, ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయం ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో గత 5 నెలలుగా పర్యటిస్తూ ఇప్పటివరకు 6వేలకు పైచిలుకు విగ్రహాలను పంపిణీ చేసినట్లు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ 16వందల విగ్రహాలు, ఆదివారం కొడంగల్‌లోని శ్రీమహాదేవుని ఆలయంలో 201విగ్రహాలను మహిళలకు అందించినట్లు ఆయన తెలిపారు. భగవంతుని భక్తితో ఆరాధిస్తే శక్తిసామర్థ్యాలు పెరుగుతాయని అన్నారు. సాయంత్రం వీరశైవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్.గురునాథ్‌రెడ్డి కుటుంబసభ్యులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు నారాయణ, రవికిరణ్, పుండరీక, వెంకటయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, కొడంగల్ వీహెచ్‌పీ, హిందూవాహిని కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
మహాదేవుని ఆలయంలో శ్రీమాణికేశ మహాసంస్థాన్ పీఠాధిపతి ప్రత్యేక పూజలు

ఘనంగా సామూహిక కుంకుమార్చన