
నత్తనడకన నిర్మాణ పనులు
దౌల్తాబాద్: నత్తనడకన సాగుతున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులతో అధికారులు, గ్రామస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలనే సంకల్పంతో గత ప్రభుత్వ హయాంలో దౌల్తాబాద్ మండలంలోని ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున 21 పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులను 8 పంచాయతీల్లో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టారు. 12 పంచాయతీల్లో అసలు పనులే ప్రారంభించలేదు. నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే పనులు వదిలేశారని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో సమావేశాలు నిర్వహించడానికి, పంచాయతీల్లోని రికార్డులు భద్రపర్చుకోవడానికి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంతలోనే ప్రభుత్వం మారడంతోపాటు సర్పంచుల పదవీకాలం ముగియడంతో భవన నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
మంజూరైన గ్రామ పంచాయతీలు
అల్లాపూర్, బండివాడ, గుముడాల, కుప్పగిరి, లొట్టికుంటతండా, నందారం, నంద్యానాయక్‌తండా, నీటూరు, పోల్కంపల్లి, చంద్రకల్, సుల్తాన్‌పూర్, సురాయిపల్లి, దేశాయిపల్లి, యాంకి, చల్లాపూర్, ఇండాపూర్, కౌడీడ్, ఈర్లపల్లి, ఊరగుంట, నాగసార్, సంగాయిపల్లి గ్రామపంచాయతీలకు 2022లో ప్రభుత్వం పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేసింది. అయితే 21 పంచాయతీల్లో నంద్యానాయక్‌తండా, ఎల్‌జీతండా, సురాయిపల్లిలో మాత్రమే పూర్తయింది. మిగిలిన 12 పంచాయతీల్లో పనులు ప్రారంభం కాలేదు. 6 పంచాయతీల్లో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పోల్కంపల్లిలో పిల్లర్ల వరకు నిర్మించారు. నందారంలో స్లాబ్ వరకు పనులు జరిగాయి. ఇలా కొన్ని గ్రామాల్లో అసంపూర్తి దశలో ఉన్నాయి. ఈ విషయమై పీఆర్‌ఏఈ నాగేంద్రకుమార్‌ను వివరణ కోరగా.. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో మంజూరైన భవనాలు నిర్మించడం లేదన్నారు. ప్రస్తుతం కడాలో మంజూరు చేయించి పూర్తి చేయిస్తున్నాం. త్వరలో పూర్తయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు.
నిధులలేమితో పంచాయతీ భవనాలకు గ్రహణం
అవస్థలు పడుతున్న గ్రామస్తులు, అధికారులు