
పచ్చిరొట్ట ఎరువుల జాడేది?
● జీలుగ, జనుము, పిల్లిపెసరు విత్తనాల ఊసెత్తని ప్రభుత్వం
● ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు
దుద్యాల్: పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి జనుము, జీలుగ, పిల్లిపెసరు వంటి వివిధ రకాల విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట సీజన్ ప్రారంభమైన తరుణంలో వ్యవసాయశాఖ అధికారులు సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంపై కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడిలో ప్రభావం చూపే ఎరువుల విషయంలో నిర్లక్ష్యం తగదని పేర్కొంటున్నారు.
మెండుగా ప్రయోజనం
పశువుల పేడ, వర్మి కంపోస్టు ఎరువులు ఉపయోగిస్తే ఆశించిన మేర దిగుబడి పొందే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అలాంటి ఎరువులు అందుబాటులో లేని వారు మాత్రం పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లుకుంటున్నారు. ముఖ్యంగా వరి పండించి పొలంలో జీలుగ, జనుము, పిల్లి పెసరు వంటి వాటిని వేసి ఎరువుగా మలుచుకుంటున్నారు. పంట సాగు చేసే ప్రారంభ సమయానికి పచ్చి రొట్ట పైరు ఏపుగా పెరిగి పూత దశకు చేరుకోవాలి. అప్పుడే మొక్కలు ఎరువుగా తయారవ్వడానికి ఉపయోగపడుతాయి. అంటే ప్రధాన పంట వేసే రెండు నెలల ముందే పచ్చిరొట్ట పైరు విత్తనాలు పొలంలో విత్తుకోవాలి. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత యంత్రంలో కలియ దున్నాలి. భూమిలోనే మరిగిపోయి ఎరువుగా మారుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.