
బస్సు చక్రం కింద పడిన మహిళ
తాండూరు రూరల్: ఆర్టీసీ బస్సు చక్రం కింద పడి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కరన్‌కోట్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాయమోళ్ల బాలమణి ఆదివారం ఉదయం కరన్‌కోట్ బస్టాండ్ వద్ద తన తల్లిని తాండూరు పట్టణానికి పంపించేందుకు వచ్చింది. ఆర్టీసీ బస్సులో వృద్ధురాలైన తన తల్లిని ఎక్కించి కిందికి దిగుతుండగా.. డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు కదిపాడు. దీంతో బాలమణి కింద పడడంతో ఎడమకాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లింది. స్థానికులు వెంటనే ఆమెను పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అటునుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక