
ఎక్కడి వడ్లు అక్కడే..!
● కొనుగోలు కేంద్రాల్లోనే 14 వేల ధాన్యం బస్తాలు ● లారీల కొరతతో మిల్లులకుతరలించని వైనం ● వర్షాలకు తడుస్తున్న వడ్లు ● ఆందోళనలో రైతులు ● పట్టించుకోని అధికారులు
బషీరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దవుతున్నాయి. బషీరాబాద్ మండలంలో ఐదు సెంటర్ల ద్వారా వడ్లు సేకరిస్తున్నారు. కాశీంపూర్‌లో ఐకేపీ ద్వారా. నావంద్గీ, నవల్గా, దామర్‌చెడ్, మైల్వార్ గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 వేల బస్తాల సేకరించారు. ఇందులో 16 వేల బస్తాలు మిల్లులకు తరలించిగా మరో 14వేల బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోయాయి. తూకాలు ముగిసిన వెంటనే ధాన్యం బస్తాలను అగ్గనూర్ సమీపంలోని వెంకట పద్మావతి, లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని బాలాజీ రైస్ మిల్లులకు తరలించాలి. కానీ లారీల కొరతతో రవాణా ఆగిపోయింది. వర్షం పడిన ప్రతిసారీ ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
గన్నీ బ్యాగుల కొరత
మండలానికి సరిపడా గన్నీ బ్యాగులు సరఫరా కాలేదు. దీంతో రైతులు వడ్లను రోడ్ల మీద, కల్లాల్లోనే ఉంచుతున్నారు. గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని కేంద్రాల నిర్వాహకులు అధికారులను కోరగా కొరత ఉందని అంటున్నారు. ప్రస్తుతం 15 వేల వరకు గన్నీ బ్యాగులు అవసరమని నావంద్గీ సొసైటీ సీఈఓ వెంకటయ్య తెలిపారు.
తేమ శాతం పేరుతో లారీ వెనక్కు
మండలంలోని మైల్వార్ కొనుగోలు కేంద్రం నుంచి మూడు రోజుల క్రితం ధాన్యం లోడ్‌తో ఓ లారీవెంకట పద్మవతి రైస్ మిల్లుకు వెళ్లింది. అయితే తేమ శాతం అధికంగా ఉందంటూ మిల్లు యజమాని లారీని మైల్వార్ కేంద్రానికి తిప్పిపంపించారు. అధికారులు పరిశీలిస్తే తేమశాతం 17 వచ్చింది. మిల్లు యజమాని తీరుతో తాము తీవ్రంగా నష్టపోయామని మైల్వార్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎక్కడి వడ్లు అక్కడే..!