
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ శంకర్
అనంతగిరి: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ ఎన్ శంకర్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటర్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విదార్థులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. సమావేశంలో జిల్లా పరీక్షల సమన్వయ కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, సత్తయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు కుమార స్వామి, ప్రిన్సిపాళ్లు సురేశ్వర స్వామి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.