
కబ్జా చెరలో 786 ఎకరాలు
బషీరాబాద్: మండలంలో వందల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మైల్వార్ రిజర్వ్‌డ్ ఫారెస్టులో సుమారు 676 ఫారెస్ట్ భూములను కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులు కబ్జా చేసి యథేచ్ఛగా పంటలు సాగుస్తున్నారు. ఈ రిజర్‌డ్వ్ ఫారెస్టులో సుమారు 5 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలోని నీళ్లపల్లి, జలాల్‌పూర్, ఇస్మాయిల్‌పూర్, మైల్వార్ గ్రామాలు.. సరిహద్దు అవతలి వైపు కర్ణాటకకు చెందిన గోపన్‌పల్లి, బోందంపల్లి తండా, ఇంద్రానగర్, కర్బార్‌తండాలు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దులు తేలకపోవడంతో కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
అనేక సార్లు సర్వే
అంతర్రాష్ట్ర అటవీ భూముల సరిహద్దు విషయమై గతంలో అనేక సార్లు అధికారులు సర్వే చేశారు. గతేడాది స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఈ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి సర్వే నిర్వహించాలని అసెంబ్లీలో ప్రస్థావించారు. అప్పట్లో దీనిపై స్పందించిన కలెక్టర్ సర్వే చేయాలని రెవెన్యూ, అటవీ అధికారులను ఆదేశించారు. సర్వేకి కర్ణాటక అధికారులు కూడా హాజరు కావాలని లేఖ రాశారు. కానీ వారు ముందుకు రాకపోవడంతో తెలంగాణ అధికారులే ఈ ఏడాది ఫిబ్రవరి 11న సర్వే చేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన 60 మంది రైతులు 286 ఎకరాలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు వంద మంది 396 ఎకరాలు కబ్జా చేసినట్లు తేల్చారు. చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ఉమ్మడి నివేదికను సమర్పించారు.
ఆక్రమణలు నిజమే
మైల్వార్ రిజర్వుడ్ ఫారెస్టులోని కంపార్ట్‌మెంట్ 49లో 811 హెక్టార్ల భూమి ఉంది. గతంలో తాము సర్వే చేశాం. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్, కర్ణాటకలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు భూములను కబ్జా చేశారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక అందజేశాం.
– శ్రీదేవి సరస్వతి, ఎఫ్‌ఆర్‌ఓ, తాండూరు