
పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీ
తాండూరు రూరల్: కరన్‌కోట్ వికారాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామానికి రెగ్యు
లర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో పని చేసిన ఆనంద్‌రావు బదిలీపై యాలాల మండలానికి వెళ్లారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఈ విషయాన్ని పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఓగిపూర్ కార్యదర్శి అమరేశ్వరి కొన్ని రోజులు ఇన్‌చార్జిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కరన్‌కోట్ గ్రామంలో 14 వేల జనాభా ఉంది. 14 వార్డులు, 7,800ఓటర్లు ఉన్నారు. గ్రామ శివారులో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు నాపరాతి గనులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామంలో 16 మంది పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారు. పెద్ద గ్రామం కావడంతో ఓ వైపు పారిశుద్ధ్య పనులు చేస్తుంటే మరోవైపు చెత్త పేరుకపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ముందే వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాపై కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మిషన్ భగిరథ నీరు సరఫరా నిలిచిపోతే కొన్ని కాలనీలో తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి 110 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించాల్సి ఉంది. గ్రామంలో నిరుద్యోగ యువతి, యువకులు 280కి పైగా రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని కూడా క్షేత్రస్థాయిలో వెళ్లిలబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పంచాయతీ కార్యదర్శి బాధ్యత కీలకంగా ఉంటుంది. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రికార్డుల నమోదు, నర్సరీ పరిశీలన, ఉపాధిహామీ పథకం పనుల పరిశీలనలో కార్యదర్శి పాత్ర ఉంటుంది. అంతేకాకుండా వివిధ సర్టిఫికెట్లకు సంబంధించి కార్యదర్శి సంతకం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు ప్రజలు వస్తుంటారు. ప్రస్తుతం కారోబార్ నర్సిములు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో సత్వరమే ఉన్నతాధికారులు స్పందించి కరన్‌కోట్ పంచాయతీ కార్యదర్శిని వెంటనే నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రెగ్యులర్ కార్యదర్శి ప్రతీ రోజు గ్రామంలోనే అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారం సులువవుతాయని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు.
కరన్‌కోట్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ
గతంలో పని చేసిన వారు బదిలీ
రెగ్యులర్ లేక ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
డీపీఓ దృష్టికి తీసుకెళ్లాం
కరన్‌కోట్‌లో పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉందని డీపీఓ దృష్టికి తీసుకెళ్లాం. ఓగిపూర్ కార్యద ర్శి అమరేశ్వరి కొన్ని రోజులు ఇన్‌చార్జిగా పని చేసింది. ప్రస్తుతం ఆమెను నియమిద్దామంటే ఇక్కడ పనిచేయడానికి సుముఖంగా లేదు. రెండు, మూడు రోజుల్లో సీనియర్ పంచాయతీ కార్యదర్శికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలనే అంశం ఆలోచన చేస్తున్నాం. లేదంటే డీపీఓ కార్యాలయం నుంచి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది.
– సుశీల్‌కుమార్, ఎంపీఓ, తాండూరు మండలం