
నిలిచిన పనులు.. రాకపోకలకు తిప్పలు
దుద్యాల్: అర్ధాంతరంగా మండల పరిధిలో మహబూబ్‌నగర్–చించోలి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కల్వర్టుల కోసం తీసిన గోతులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం బిక్కుబిక్కుమంటూ వాహనదారులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు పనులు ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి పనులు కలిగిన రహదారిపై వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
సూచికలు లేవు
దుద్యాల్ గేట్ నుంచి హస్నాబాద్ వెళ్లే మార్గమధ్యలో కల్వర్టుల పనులు అసంపూర్తిగా వదిలేశారు. అక్కడ రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదం పొంచి ఉన్నా కల్వర్టు దగ్గర తాత్కాలికంగా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని చోదకులు వాపోతున్నారు. దీంతో ఏ సమయంతో అయిన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కల్వర్టుల దగ్గర వేసిన రోడ్డు వాహనాల రాకపోకలకు కొంత భాగం కూలిపోయి ప్రమాద స్థాయిని మరింత పెంచింది. అలాగే హస్నాబాద్ గ్రామంలో రోడు నిర్మాణ పనుల్లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీసిన గుంతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పనులు పూర్తిగా నిలిపివేయడంతో గుంతల్లో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు కారణమవుతుంది. గతేడాది డిసెంబర్‌లో తెల్లవారుజామున పాలను తరలించే ఓ ఆటో ప్రమాదానికి గురైంది. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులు తెలుపుతున్నారు.
అసంపూర్తిగా మహబూబ్‌నగర్–చించోలి రహదారి నిర్మాణం
కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా మారిన వైనం
పట్టించుకోని అధికార యంత్రాంగం