
ప్రైవేటుకే మొగ్గు!
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
8లోu
వికారాబాద్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు కావస్తున్నా పంట దిగుబడిలో కేవలం పది శాతం మాత్రమే విక్రయించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, కొర్రీల కారణంగా బహిరంగ మార్కెట్, కళ్లాల వద్ద దళారులకు విక్రయిస్తున్నారు. మరో వైపు వరుణు గండం పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమై కళ్లాల్లోకి ధాన్యం నిల్వలు చేరాయి. వడ్లు ఆరబెట్టి విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు భయపెడుతున్నాయి. 15 రోజులుగా అడపదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో వరి దిగుబడిని అంచనా వేసిన అధికారులు 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 85 సెంటర్లను ప్రారంభించారు. తాలు, తేమ శాతం పేరిట కేంద్రాలకు వచ్చిన వడ్లను నిర్వాహకులు తిప్పి పంపుతుండటం రైతులకు ఇబ్బందిగా మారింది.
లక్ష్యం.. లక్ష మెట్రిక్ టన్నులు
జిల్లాలో 93 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని భావిస్తున్నారు. అయితే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి 25రోజులు కావస్తున్నా కేవలం 17 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. ఇందులో 424 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు కాగా, 13.44 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.40 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.18 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ. 22 కోట్లు చెల్లించాల్సి ఉంది.
న్యూస్‌రీల్
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపని రైతులు సకాలంలో డబ్బు జమకాకపోవడం, కొర్రీలే కారణం 25 రోజులు కావస్తున్నా వచ్చింది పది శాతం వడ్లే పొంచివున్న వరుణ గండం రోడ్లపై ఆరబోసిన ధాన్యం ఆందోళనలో అన్నదాతలు
కేంద్రాల కుదింపు
రెండేళ్ల క్రితం 60 వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా 167 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగినా (92 వేల ఎకరాల్లో) 128 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు. ప్రస్తుతం 85 సెంటర్ల ద్వారానే ధాన్యం సేకరిస్తున్నారు. ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష మెట్రిక్ టన్నులు రావచ్చని చెబుతున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం ఆరబోసుకునేందుకు సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 93వేల ఎకరాలు
దిగుబడి అంచనా 2.25లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు సేకరించింది 17వేల మెట్రిక్ టన్నులే
రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.40 కోట్లు
జమ చేసింది రూ.18 కోట్లే
పక్కాగా ఏర్పాట్లు
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు చేశాం. తాలు, తరుగు, తేమ శాతం, మట్టి పెల్లలు ఎంత మేర ఉంటే కొనుగోలు చేయాలనే దానిపై కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. ప్రస్తుతం వర్షాలు పడుతుండటం కొంత మేర ఇబ్బంది కలిగిస్తోంది. అయినా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యం మిల్లులకు చేరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి. దళారులను నమ్మి మోసపోరాదు.
– లింగ్యానాయక్,
అడిషనల్ కలెక్టర్
భయపెడుతున్న వరుణుడు
పది రోజుల నుంచి అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కళ్లాలు, రోడ్లపై ఆరబోశారు. ఈ సమయంలో వర్షాలు పడితే వడ్లు తడిసి గిట్టుబాటు ధర రాదని భయాందోళన చెందుతున్నారు. చాలా మంది రైతుల వద్ద టార్పాలిన్లు లేవు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థలాలు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సేకరించిన వడ్లను రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది.

ప్రైవేటుకే మొగ్గు!