
వీర జవాన్లకు ఘన నివాళి
అనంతగిరి: భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన సైనికుల కోసం మంగళవారం వికారాబాద్ పట్టణంలో అశ్రునివాళి పేరిట సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఆలంపల్లి నుంచి ప్రధాన రోడ్ల మీదుగా ఎన్‌టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, వ్యాపారులు, మాజీ సైనికులు, కుల సంఘాల నాయకులు, పైవేటు స్కూళ్ల అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, వైద్య కళాశాల విద్యార్థులు, యువకులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. సైన్యానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీర జవాన్ల కుటుంబాలకు, దేశానికి అండగా ఉంటామన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా చిన్నారులు, పెద్దలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్‌టీఆర్ చౌరస్తా వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించి పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు సత్తయ్య, లింగమయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్. సాధు సత్యనాధన్, ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఆయా పార్టీల నాయకులు వడ్లనందు, అశోక్, అమరేందర్‌రెడ్డి, దేవదాసు, శివరాజు, సుభాష్, సుభాన్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్, పాండుగౌడ్, శ్రీధర్‌రెడ్డి, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావ యాత్రకు భారీగా తరలివచ్చిన జనం
ఆలంపల్లి నుంచి ఎన్‌టీఆర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీ
దేశం నుంచి బహిష్కరించాలి
పరిగి: పాకిస్తానీయులను దేశం నుంచి బహిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పరిగి పోలీస్ స్టేషన్, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిగి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో పాకిస్తానీయులు ఉన్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అలాగే దేశ సంపద తింటూ వ్యాపార సంస్థలకు శత్రు దేశం పేర్లు పెట్టుకోవడం దారుణమన్నారు. అలాంటి పేర్లను వెంటనే తొలగించి ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్, కార్యదర్శి పెంటయ్య గుప్తా, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వీర జవాన్లకు ఘన నివాళి