
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ సంస్థ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు కోల్పోయిన బాలికల నుంచి, అక్రమ రవాణాకు గురైన, దివ్యాంగ బాలికల నుంచి మూడు సంవత్సరాల టెక్నికల్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి జయసుధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. అమ్మాయిలు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. దరఖాస్తుకు కులం, ఆదాయం (అనాధబాలికలకు అవసరం లే దు), తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం, బోనాఫైడ్ సర్టిఫికెట్లను జతచేసి ఈ నెల 20వ తేదీలోపు వికారాబాద్‌లోని బాలరక్ష భవన్‌లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ల 9640863896, 9849672296లోసంప్రదించాలన్నారు.
ప్రశాంతంగా పాలిసెట్
అనంతగిరి: పాలిసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాల, ఏసీఆర్ భృంగీ పాఠశాలలో సెంటర్లు ఏర్పాట్లు చేశారు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 1,400 మందికి గాను 1,282 మంది విద్యార్థులు హాజరైనట్లు పాలీసెట్ జిల్లా కన్వీ నర్ రవీందర్ తెలిపారు.
ఆటోనగర్ ఏర్పాటు చేయాలని వినతి
తాండూరు: పట్టణ శివారులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని తాండూరు మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కోరారు. కోకాపేట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లారీ మెకానిక్ అసోసియేషన్, స్టోన్, క్వారీ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందించారు. పట్టణంలో ఆటోనగర్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే తాండూరు – హైదరాబాద్ మార్గంలో అధునాతన వసతులతో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, పట్లోళ్ల నర్సింహులు, జుబేర్‌లాల, మసూద్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు అధిక దిగుబడితో ఆదర్శంగా నిలవాలి
రంగారెడ్డి వ్యవసాయాధికారి నర్సింహారావు
యాచారం: కూరగాయలు, ఆకుకూరల దిగుబడి సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో మంగళవారం రైతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలెట్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నమోదు ప్రక్రియను తెలియజేశారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్‌కుమార్ వ్యవసాయ, పండ్లతోటల పెంపకం గురించి వివరించారు. డ్రిప్ పద్ధతి ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి పొందొచ్చని తెలిపారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నవీన తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం