
ఫిర్యాదులు అందితే చర్యలు
● వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి ● కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం
అనంతగిరి: వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఉన్నతాధికారులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల, వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్‌బ్యాంక్, వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వికారాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి 45 రోజుల్లో మెడికల్ ఎక్విప్‌మెంట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందజేస్తామన్నారు. వికారాబాద్ జీజీహెచ్‌కు ఎంఆర్‌ఐ స్కాన్‌ను మంజూరు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన, ప్రజలకు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పునఃపరిశీలించి రోడ్డు భద్రత సమావేశాలను నిర్వహించి బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో సత్వర వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.5.5కోట్ల నిధులను వెచ్చిస్తామని వివరించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీయంహెచ్‌ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పీహెచ్‌సీ, సబ్ సెంటర్లలో వైద్య సేవలను మెరుగుపర్చాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వేతర ఆస్పత్రులను ఎప్పటికపుడు తనిఖీ చేయాలన్నారు. నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగిరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతిగృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ అజయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరవణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంచంద్రయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.

ఫిర్యాదులు అందితే చర్యలు