
లగచర్లలో టెన్షన్.. టెన్షన్
● పోలీస్ పహారాలో భూ సర్వే ప్రక్రియ పూర్తి ● ఊపిరి పీల్చుకున్న అధికారులు
కొడంగల్: దుద్యాల్ మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట, రోటిబండ, పులిచర్ల కుంట తండాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో భూములు ఇవ్వడానికి సమ్మతించిన రైతుల పట్టా భూముల్లో సర్వే చేపట్టారు. తహసీల్దార్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో తొమ్మిది సర్వే నంబర్లలోని 85 ఎకరాల భూమిని సర్వే చేశారు. రైతులు చూపించిన హద్దులను గుర్తించి వారి సంతకాలు తీసుకున్నారు. భూములు ఇవ్వడానికి తాము సమ్మతిస్తున్నట్లు పలువురు ప్రకటించారు. భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారి పొలాల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శివకుమార్, సర్వేయర్లు మహేష్, కిరణ్, మహేష్‌కుమార్, ఆర్‌ఐ నవీన్‌లు సర్వే చేశారు. అయితే గతంలో జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో లగచర్ల, హకీంపేట గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్పీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో పారా మిలటరీ బలగాలతో పాటు సివిల్ పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తహసీల్దార్ కిషన్‌నాయక్, డిప్యూటీ తహసీల్దార్ వీరేష్‌బాబులతో పాటు పోలీస్ సిబ్బందికి ఎస్పీ తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. సర్వే ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. దీంతో భూ సర్వే ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. గత అనుభావాల దృష్టా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిగి డివిజన్ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్ల నుంచి పోలీసులను రప్పించారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు మండలాలకు చెందిన ఎస్‌ఐలు సత్యనారాయణ, యాదగిరి, రవిగౌడ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

లగచర్లలో టెన్షన్.. టెన్షన్