
విజయ్ దేవరకొండపై ఫిర్యాదు
కుల్కచర్ల: సినీ హీరో విజయ్ దేవరకొండ గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హీరో వెనుకబాటుకు గురైన వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు అంగూర్ నాయక్, నాయకులు చిట్టునాయక్, గణేశ్‌నాయక్, హన్మ్యనాయక్, రవినాయక్, అరుణ్, శ్రీను, గోపాల్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.