
ఆదర్శ కవయిత్రి మొల్ల
ప్రొఫెసర్ విజయలక్ష్మి
తాండూరు: రామాయణ మహా గ్రంథాన్ని సరళ భాషలో రచించిన మొల్ల జీవితం మహిళా లోకానికే ఆదర్శమని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏ విజయలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో కవయిత్రి మొల్ల కళావేదిక ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవయిత్రిలు జ్వలిత, మంజుశ్రీ, సక్కుబాయిలకు మొల్ల సాహిత్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మొల్ల కళా వేదిక ఫౌండర్, అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి వంశరాజు, కవులు రవీందర్, బాలకృష్ణ, బసవరాజు, కోటం చంద్రశేకర్, యూసుఫ్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో అక్రమాలు సహించేది లేదు
షాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని డీఆర్‌డీఓ శ్రీలత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ భవనంలో 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులను ఎంపిక చేసుకోవాలన్నారు. మొక్క లు నాటడం, వాటి సంరక్షణ, వ్యవసాయ పొలాల్లో కాలువలు తవ్వడం, పొలాలను చదును చేయడం, గట్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, ఏపీడీ చరణ్‌గౌతమ్, ఏఈవో కొండయ్య పాల్గొన్నారు.