
ఫార్మా పేరుతో భూములు లాక్కునే కుట్ర
దుద్యాల్: లగచెర్ల ఘటనలో వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం, పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదు ప్రతిని సోమవారం మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య. సీపీఎం జిల్లా నాయకుడు బుస్స చంద్రయ్య మాట్లాడుతూ.. లగచెర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండా, పోలేపల్లి, హకీంపేట్ గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం 1,273.24 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకునేందుకు కుట్ర చెస్తోందన్నారు. లగచర్ల ఘటన తర్వాత పోలీసులను ఉసిగొల్పి అమాయక గిరిజనులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు దుద్యాల్, కొడంగల్, బొంరాస్‌పేట్ మండలాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. తమ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ కేసు నంబర్ 19141/ఐఎన్/2024ను కేటాయించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, నాయకులు లక్ష్మయ్య, అనంతయ్య, జయనంద్, తదితరులు పాల్గొన్నారు.
పోలీసులను ఉసిగొల్పిఅక్రమ కేసులు బనాయిస్తున్నారు
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వ్యవసాయ, కార్మిక సంఘాల ఫిర్యాదు