పాతాళంలోనే..
వికారాబాద్: వర్షాకాలం సగం పూర్తయినా జిల్లాలో భూగర్భజలాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి. బోర్లు, బావుల్లో నీళ్లు రావడం లేదు. పలు మున్సిపాలిటీల్లో నేటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. చాలా మండలాల్లో అనుకున్న మేర వర్షపాతం నమోదైనా చెరువులు, కుంటలు నిండలేదు. గతేడాది వానాకాలం సీజన్‌తో పోలిస్తే ఈ సారి రెండు మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఏటా ఈ సీజన్‌లో రైతులు 1.30లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం చెరువులు, బోరు బావుల్లోకి నీరు చేరకపో వడంతో వరి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పెంపునకు అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో వేలకు వేలు ఇంకుడు గుంతలు తవ్వామని చెబుతున్నా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. చెక్ డ్యామ్‌లు, ఫారంఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంతో వర్షాపు నీరు భూమిలోకి ఇంకకుండా వృథాగా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది.
గతేడాదితో పోలిస్తే..
గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు ఈ ఏడాది ఎక్కవగా అడుగంటాయి. 2023 జూలై చివరలో జిల్లాలో సగటున 10.25 మీటర్ల లోతుకు భూ గర్భ జలాలు పడిపోగా ఈ ఏడాది అదే జూలై నెలాఖరు వరకు 12.12 మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి. పెద్దేముల్ మండలం నాగులపల్లిలో 30 మీటర్ల లోతుకు, బొంరాస్‌పేట్ మండలం అంసాన్‌పల్లిలో 29 మీటర్లు, యాలాల మండలం దేవనూర్‌లో 26.78 మీటర్లు, నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లిలో 24 మీటర్లు, వికారాబాద్‌లో 23 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొడంగల్ మండలం రుద్రారం(డీ)లో 22మీటర్లు, రుద్రా రం(ఎస్)లో 21 మీటర్లు, మర్పల్లి మండలం దర్గుపల్లిలో 20మీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లాలోని సగం మండలాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు భూగర్భ జల వనరుల శాఖ నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా జూలై చివరినాటికి వరి నాట్లు వేసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఈ సారి ఆ పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వరి సాగు చేయక పోతే దిగుబడి రాదని అన్నదాతలు తెలిపారు.
వనరులను కాపాడుకోవాలి
గ్రౌండ్ వాటర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రధానంగా ఇంకుడు గుంతలు తవ్వడం తోపాటు వాటి నిర్వహణ సక్రమంగా ఉండాలి. చెరువులు, కుంటలు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లలో పూడిక తీసి నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటం కూడా ఓ సామాజిక బాధ్యతగా భావించాలి.
– రవిశంకర్, జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్
వరినాట్లపై ప్రభావం
ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే ఎక్కువ వానలు పడ్డా చెరువులు మాత్రం నిండలేదు. జిల్లాలో 1,179 చెరువులు ఉన్నాయి. గతేడాది జూలై నాటికి 1,023 చెరువులు నిండాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క చెరువు కూడా నిండలేదు. దీంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడనుంది. పరిస్థితి ఇలాగే ఉంటే వరినాట్లు వేసుకోవటం గగనమే. భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో పదెకరాలు సాగు చేయాల్సిన చోట ఐదెకరాలు సాగు చేయాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు.
పైకి రాని గంగమ్మ
గతేడాదితో పోలిస్తే రెండు మీటర్ల లోతున..
కొన్ని మండలాల్లో 30మీటర్ల లోతులో..
జిల్లాలో ఒక్క చెరువూ నిండని వైనం
వర్షాలు పడినాపెరగని భూగర్భజలాలు
పాతాళంలోనే..


